గుంటూరు: రూరల్ జిల్లా పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రూరల్ ఎస్పీ అప్పలనాయుడు స్పష్టం చేశారు. పోలీస్ కార్యాలయంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఆయన అధికారులు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు అవసరమైన శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సిబ్బందికి విధుల కేటాయింపు, పోలీసింగ్ నిర్వహణపై కూడా శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి బందోబస్తు నిమిత్తం వచ్చే సిబ్బందికి కనీస సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. చోరీల నివారణకు రాత్రి గస్తీని పటిష్ఠం చేయాలన్నారు. ముఖ్యంగా పాత నేరస్థులు, నేర చరిత్ర కలిగిన వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. అదేవిధంగా జైలు నుంచి విడుదలైన రిమాండ్ ఖైదీలు, నేరస్థుల కదలికలను గమనిస్తుండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లలో నిందితులను కోర్టులో హాజరు పరిచి వారెంట్లు తగ్గించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మట్కా, జూదం, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచి నిర్వాహకులపై కఠిన వైఖరి అవలంబించాలన్నారు.
పలు చట్టాలపై అవగాహన
తిరుపతి నుంచి వచ్చిన ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ రోజ్దోర్ పలు చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్, పీడీ యాక్ట్, పోక్సో, తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయనను రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో శాలువ కప్పి సన్మానించారు. సమావేశంలో డీఎస్పీలు కృష్ణ కిషోర్‌రెడ్డి, కాలేషా వలి, గంగాధర్, స్నేహిత, నాగేశ్వరరావు, వెంకట నారాయణ, లక్ష్మయ్య, చుండూరు శ్రీనివాసరావు, పి శ్రీనివాస్, మూర్తి, ఓఎస్డి నాగేశ్వరరావు, మహిళా స్టేషన్ డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి, ఏఆర్ డీఎస్పీసత్యనారాయణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
|