కళాతపస్వికి అపూర్వ సత్కారం
|
జీవన సాఫల్య పురస్కారం అందజేసిన రోటరీ సంస్థ
విజయవాడతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న విశ్వనాథ్
ఆంధ్రజ్యోతి, విజయవాడ: బీసెంట్‌రోడ్డులోని బందరు మిఠాయి దుకాణంలో జీడిపప్పు పాకమెంత రుచిగా ఉండేదో.. బ్రిడ్జి పక్కన కాలువ ఒడ్డున సంపెంగ పూలు ఎంత గుభాళించేవోనని కళాతపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ అన్నారు. విజయవాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయనకు నగరంలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో జీవనసాఫల్య పురస్కారాన్ని అందచేశారు. తొలుత పూర్ణకలశంతో స్వాగతం పలుకుతూ, వేద మంత్ర పఠనం మధ్య వేదికవద్దకు తీసుకురాగా ఆయనపై రోటరీ సభ్యులు పూలరేకులను చల్లారు. జీవనసాఫల్య పురస్కారం అందుకున్న కళాతపస్వి విశ్వనాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనకు గత రెండు రోజులుగా అస్వస్థతగా ఉందని, మాట పెగలడం లేదంటూ మూడు మాటలు చెప్పారు. తాను చిన్నపుడు విజయవాడలోనే దాదాపు 30 సంవత్సరాల పాటు ఉన్నానని, గాంధీజీ మునిసిపల్ స్కూల్, సీవీఆర్ స్కూల్స్‌లో చదివానని గుర్తు చేసుకున్నారు. చిన్నపుడు బీసెంట్‌రోడ్డులో బందరు మిఠాయి దుకాణం ఉండేదని, అందులో జీడిపప్పు పాకం కొనుక్కుని ఇంటికి తీసుకు వెళ్ళివాడినని, ఎంతో అద్భుతమైన రుచి ఉండేదని అన్నారు ఆపక్కనే సంపెంగ పూలు అమ్మేవారని అవి ఎంతో గుభాళించేవన్నారు.
విజయవాడ అంటే తనకు అమితమైన ప్రేమ అన్నారు. స్వాతిముత్యం సినిమాను విజయవాడలోనే షూటింగ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆరోజుల్లో డాక్టర్ జంధ్యాల దక్షిణామూర్తి గుర్రం బండిపై వస్తున్నారంటే సగం వ్యాధి నయమయ్యేదని, ఆనాడు ఆయన పేదలకు ఉచితంగా మందులు ఇచ్చేవారని చెప్పారు. తనను ఇప్పుడు అందరూ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అని అంటున్నారని, అయితే తనను కాఽశీనాథుని విశ్వనాథ్గానే పిలవాలని వినమ్రతతో చెబుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా రోటరీ విజయవాడ అధ్యక్షుడు భగవంతరావు మాట్లాడుతూ, విశ్వనాథ్‌కు జీవన సాఫల్య అవార్డును ఇవ్వడం అదృష్టంగా, గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. 3020 గవర్నర్ జీవీ రామారావు స్వయంగా విశ్వనాథ్‌కు పట్టు వస్ర్తాలను బహూకరించారు. రోటరీ తరఫున కిరీటం ధరింపచేసి పంచలచాపులు. జ్ఞాపికలను బహుకరించారు. కృష్ణాజీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంసీ దాస్ రోటరీ కార్యక్రమాలను వివరించారు. విశఽ్వనాథ్కు జీవనసాఫల్య పురస్కారం అందచేయాలని తమ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. డాక్టర్ పట్టాభిరామయ్య, కె.గోపాలరావు, నగేష్, నవీన్, సుబ్బారావు, రాయుడు, పార్ధసారధి తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ఐలాపురం హోటల్ అధినేత రాజా, ఛాయాగ్రహకుడు రఘు ఇంకా పలు సంఘాల వారు విశ్వనాథ్‌ను సత్కరించారు. సభా కార్యక్రమానికి ముందు లేఖ్యాభరణి నాట్యం, స్వాతి పాట, ప్రసన్నత ఈల పాట ఆహుతులను ఆలరించాయి. తెలుగు చలచనచిత్రాంకిత దివ్య కళా తపస్వి, భారతీయ సంస్కృతి సంరక్షిత మనస్వి, తెలుగు తల్లి ఆలయాన కళల కల్ప వృక్షమా, నమో నమో విశ్వనాథ, జయ జయ జయహో విశ్వనాథ్ అంటూ పాడిన పాట అద్హుతంగా సాగింది.
|
|
|