ప్రభుత్వ భూములే టార్గెట్
|
యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా
వినుకొండలో బరితెగిస్తున్న భూ బకాసురులు
ఆపై ప్లాట్లు వేసి విక్రయం
నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న వెంచర్లు
నేతల అండదండలతో రెచ్చిపోతున్న రియల్ మాఫియా
అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు
వినుకొండ కేంద్రంగా భూబకాసురులు బరితెగిస్తున్నారు.. ప్రభుత్వ భూములే లక్ష్యంగా యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు.. సర్కారీ భూములను గాలించడం.. వెంటనే ఆ పక్కనే ఉన్న భూముల యజమానుల నుంచి నయానో భయానో భూములు లాక్కోవడం.. ఆ తరువాత పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కలిపేసుకుని ప్లాట్లు వేసి విక్రయించేయడం.. ఇదీ వినుకొండ ప్రాంతంలో కొత్తదారులు తొక్కుతున్న రియల్ దందా తీరు..అధికారపార్టీ నాయకుల అండదండలతోనే ఈ రియల్ దందా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
వినుకొండ : వినుకొండ ప్రాంతంలో విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొందరు అక్రమార్కులు ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటుందో అక్కడ సమీపంలోని భూములను అధికారాన్ని అడ్డంపెట్టుకొని బతిమాలో బెదిరించో వారి వద్ద నుంచి తక్కువ రేటుకు కొని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కలిపేసుకొని వెంచర్లు వేసి విక్రయాలు సాగిస్తున్నారు. పట్టణంలో జరుగుతున్న రియల్‌దందాలో కీలకపాత్ర వహిస్తూ అధికార పార్టీకి చెందిన నాయకుడు ఆపన్నహస్తం అందిస్తుండటంతో రియల్టర్లు ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారన్నది బహిరంగ రహస్యం. ఇటీవల కాలంలో పట్టణంలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. పట్టణంలోని నూజెండ్ల రోడ్డులోని రైల్వేగేటు పక్కన, జాలలపాలెం పంచాయతీ పరిధిలో వేసిన వెంచర్లకు ముఖ్య పాత్రధారి అధికారపార్టీ నాయకుడేన ని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులను గుప్పెట్లో పెట్టుకొన్న నేత అండతో రియల్ మాఫియా రెచ్చిపోతోంది.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లు..
వినుకొండ పట్టణంలో భూములకు అమాంతంగా విలువరావడం, లక్షల రూపాయలు విలువ చేసే భూములు కాస్త కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలను అతిక్రమిస్తూ ఇష్టానుసారంగా వెంచర్లు వేస్తున్నారు. అక్రమంగా వేసిన వెంచర్లపై అధికారుల చూపు పడకుండా ఉండేందుకు వారిపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తూ వ్యవహారం చక్కబెట్టుకుం టున్నారు. వెంచర్లలోని ప్లాట్లను అమ్ముకునేందుకు కొనుగోలు దారులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన బ్రోచర్లు విడుదల చేస్తున్నారు. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని నమ్మబలుకుతున్నారు. సొంతింటి కలను నిజం చేసుకోవాలంటే తమ వెంచర్లలో ప్లాట్‌ను కొనుగోలు చేసి వాయిదాల పద్ధతిలో నగదును చెల్లించే అవకాశం ఉందంటూ బ్రోకర్లను రంగంలోకి దించి విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. అన్ని మౌలిక వసతులు కల్పిస్తామంటూ చెప్పడంతో మధ్యతరగతి కుటుంబాలు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు వెంచర్ల వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే వాటిలో ఒక్క వెంచర్‌కు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండవలసిన అనుమతులు లేవు.
వ్యవసాయ భూముల్లో ప్లాట్లు..
భూముల ఆక్రమణతోపాటు ఎలాంటి నిబంధనలు పాటించకుండా వ్యవసాయ భూములను ఇళ్ల ప్లాట్లుగా మార్చి సొంత లేఔట్లు సృష్టించి విక్రయాలకు పాల్పడుతున్నా అధికారులు కళ్లుండి చూడలేని స్థితిలో ఉండిపోతున్నారు. వ్యవసాయ భూములను ఇళ్లప్లాట్లుగా మార్చాలంటే ల్యాండ్ కన్వర్షన్ తప్పనిసరి. కానీ ఎటువంటి అనుమతులు లేకుండా పట్టణంలో, పట్టణ పరిసర గ్రామాలైన బ్రాహ్మణపల్లి, వెంకుపాలెం, తిమ్మాయిపాలెం, జాలలపాలెం, చాట్రగడ్డపాడు, నాగిరెడ్డిపల్లి, నూజెండ్ల మండలంలోని ఉప్పలపాడు తదితర గ్రామాల్లో సాగుభూములను ఇళ్లప్లాట్లుగా మార్చేశారు. ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం ఎకరా భూమి విలువ రూ.22 లక్షల నుంచి రూ.46 లక్షల వరకు ఉంది. మార్కెట్ విలువ ప్రకారం వ్యవసాయ భూములను ఇళ్లప్లాట్లుగా మార్చాలంటే 4.5 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. దీని ప్రకారం ఒక్కొక్క వెంచర్ యజమానులు ప్రభుత్వానికి లక్షల్లో చలానా చెల్లించాల్సి ఉన్నా అధికారుల కళ్లు కప్పి నిబంధనలను అతిక్రమిస్తూ వ్యాపారులు ఇష్టానుసారం వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ల్యాండ్ కన్వర్షన్ కోసం ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదంటే రియల్ దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వెంచర్‌కు కావాల్సిన అనుమతులివీ..
మునిసిపాలిటీ పరిధిలో వెంచర్ వేయాలంటే లేఔట్ అనుమతులు తప్పనిసరి. వ్యాపారులు వేసిన లేఔట్లో ఎకరానికి 10 శాతం భూమిని ప్రజల మౌలిక వసతుల నిమిత్తం మునిసిపాలిటీకి రిజిస్ర్టేషన్ చేయాలి. వెంచర్లలో 40 అడుగుల బీటీ రోడ్లు, 30 అడుగుల ఇన్నర్రోడ్లు ఉండాలి. పంచాయతీ పరిధిలో వ్యవసాయ భూమిని ఇళ్లప్లాట్లుగా మార్చాలంటే 10 శాతం భూమిని పంచాయతీకి రిజిస్ర్టేషన్ చేసి ప్రభుత్వ విలువ ప్రకారం రూ.లక్షకు రూ.14,500ల చలానా చెల్లించాలి. రెండున్నర ఎకరాల్లోపు వెంచర్ వేయాలంటే జిల్లా కంట్రీబ్యూటర్ ప్లానింగ్ వారికి పంచాయతీ నుంచి సిఫార్సు పంపి వారి వద్ద నుంచి సాంకేతిక అనుమతులు తెచ్చుకోవాలి. వెంచర్ పరిధిలో ఎలక్ర్టిక్ పోల్స్, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ తప్పనిసరిగా ఉండాలి. 2 నుంచి ఐదెకరాల్లోపు వెంచర్ వేయాలంటే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్, 5 ఎకరాలు దాటిన వెంచర్‌కు డీటీసీపీ నుంచి అనుమతులు పొందాలి. కానీ వినుకొండ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క వెంచర్‌కు కూడా ఎటువంటి అనుమతులు లేవు. అధికారులను రాజకీయ ఒత్తిళ్లకు గురి చేసి అక్రమార్కులు తమ పని సులభం చేసుకుంటున్నారు
|
|
|