తాజా వార్తలు ఓటే ఆయుధం!         కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట         తారీకు : 23-10-2017
 
ఓటే ఆయుధం!
ఓటంటే ఓ సీఎం.. ఓ పీఎం
ఐక్యంగా ఉంటే పార్టీలే సీట్లిస్తాయి.. చట్టసభల్లో 50ు కోటాతోనే న్యాయం
126సార్లు రాజ్యాంగాన్ని సవరించారు.. బీసీల కోసం మరోసారి చేయలేరా?
రాజమహేంద్రవరం బీసీ గర్జన సభలో నేతల డిమాండ్‌
రాజమహేంద్రవరం : ఓటే ఆయుధం.. ఓటంటే ఓ సీఎం పదవి.. ఓటంటే ఓ పీఎం పదవి.. ఓటును తెల్లకాగితంగా, మిషన్‌ బటన్‌గా చూడొద్దు. దేశంలో 52 శాతంగా ఉన్న బీసీలు.. బీసీలకే ఓట్లేస్తే వారికే రాజ్యాధికారం వస్తుంది. మనలో ఐక్యత వచ్చింది. ఇంకా రావాలి. మన ఓట్లు మనం వేసుకునే స్థాయికి ఎదగకుండా నన్ను పార్టీ పెట్టమంటే ఎలా? మనం ఐక్యంగా ఉంటే ఇప్పుడున్న పార్టీలే మనకు సీట్లిస్తాయి. మనల్ని మంత్రులను చేస్తాయి’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్‌లో ఆదివారం జరిగిన బీసీ గర్జనసభలో ఆయన ప్రసంగించారు.

గుర్రానికి గడ్డివేసి ఆవును పాలిమ్మంటే ఎందుకిస్తుందని ప్రశ్నించారు. బీసీలకు ఓట్లేస్తేనే బీసీలు, బీసీ నేతలు మన అభివృద్ధి చూస్తారని తెలిపారు. ‘ఇది గర్జనకాదు. మహాజాతర.. ఓ తిరునాళ్ల. వీళ్లంతా ఓట్ల కోసం వచ్చినవాళ్లు కాదు. బీసీల కోసం పోరాడే నాయకులు. మనది ఆకలిపోరాటం కాదు.. ఆత్మగౌరవ పోరాటం. మన వెనకబాటుతనం దేవుళ్లను నమ్ముకుంటే పోదు.. నుదుటిరాత అని బాధపడితే పోదు.. ముస్లింలలో 74 కులాలున్నాయి. కానీ మీదే కులమని అడిగితే ముస్లిం అంటారు. ఎస్సీల్లో 58 కులాలున్నాయి. మీదే కులమని అడిగితే ఎస్సీ అంటారు. ఎస్టీలూ అంతే. కానీ మనల్ని ఎవరైనా కులం అడిగితే కులం పేరే చెబుతాం. బీసీ అంటున్నామా, అనం. మనం మన సోదరుల మాదిరిగా బీసీ అని చెప్పగలిగితేనే రాజకీయ పార్టీలు గడగడలాడతాయి.. మనల్ని గుర్తిస్తాయి. పోటీపడి ఎదురుపిలిచి టికెట్లిస్తాయి’ అని చెప్పారు.

గత ఎన్నికలకు ముందు 50 బీసీ సంఘాలను తీసుకుని చంద్రబాబు దగ్గరకు వెళ్లి మాకు సీట్లిమ్మని అడిగాను. ఆయన ఒకటే అన్నారు. 50 కాదు.. అంతకంటే ఎక్కువే ఇస్తాను. కానీ మీరంతా ఏకమవ్వండి.. నాకు గెలుపే ముఖ్యమని చెప్పారు. మనలో ఎవరికి సీట్లిచ్చినా మనం ఐక్యంగా గెలిపించుకుంటే అన్ని పార్టీలు మనకు సీట్లిస్తాయి. మన వాళ్లకు ఓట్లేసి ఎమ్మెల్యేలు, మంత్రులను చేసుకోగలిగితే నారా లోకేశ్‌ సీఎం అయినా మనకోసమే పనిచేస్తారు. వడ్డించేవాడు మనవాడైతే నాలుగు ముక్కలు పడతాయి. నాయకత్వం కోసం, మన బిడ్డల భవిష్యత్‌ కోసం మన వేషం, భాష, నడక మార్చి అడుగు ముందుకేయాలి. గొర్రెలకు తోడేలును కాపలా పెట్టొద్దు. వాటిని కాపాడే వాళ్లనే కాపలా పెట్టండి’ అని హితవు పలికారు. 126 సార్లు రాజ్యాంగాన్ని మార్చిన మన పాలకులు బీసీల కోసం ఒకసారి సవరించలేరా అని ప్రశ్నించారు. 52శాతం జనాభా ఉన్న బీసీలకు 50శాతం సీట్లివ్వడం కోసం రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్‌ చేశారు.

శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘బీసీగా పుట్టినందుకే నాకీ పదవి లభించింది. బీసీలంతా ఐక్యంగా ఉండాలి. ఎక్కడ ఏ మీటింగ్‌ పెట్టుకున్నా హాజరవుతాను’ అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందని, వాటిని మరింత పెంచాల్సి ఉందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలిపారు. ‘కొన్ని అభివృద్ధి చెందిన కులాలను బీసీల్లో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానివల్ల బీసీల మనుగడ దెబ్బతింటుంది. రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు కోల్పోతాం. ప్రభుత్వం, పార్టీలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు సూచించారు.

ప్రముఖ సామాజికవేత్త పట్టపగలు వెంకట్రావు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా 52శాతం ఉన్న జనాభాకు న్యాయంగా రావాల్సిన వాటా రాలేదన్నారు. సమావేశంలో తుని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ యనమల కృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జడ్పీ మాజీ చైర్మన్‌ చెల్లుబోయిన వేణు, అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ చల్లా శంకరరావు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
ఓటే ఆయుధం!
కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట
అమరావతిలో భారీ ఆదిశంకరాచార్యుల విగ్రహం
ఆశలన్నీ రబీపైనే!
విజయవాడలో సినిమాకెళ్లేవారికి గుడ్‌న్యూస్
పోలవరం పూర్తి కావాలి!
మెసేజ్‌ పెట్టండి.. మూడు రోజుల్లో నిధులు!
ఆదుకున్న సీఎంకు కృతజ్ఞత!
ఐదు రోజులే శీతాకాల సమావేశాలు
5 భారీ పరిశ్రమలు!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :146288                      Contact Us || admin@rajadhanivartalu.com