తాజా వార్తలు ‘నిపా వైరస్‌’ సత్యం         అర్ధరాత్రి 12.15కు వైష్ణవ్ మరణిస్తే, తెల్లారి 5 వరకూ దత్తన్నకు తెలియదు!         తారీకు : 24-05-2018
 
మన టెకీలకు మస్తు చాన్స్‌
అమెరికా గ్రీన్‌కార్డుకు ఇక ప్రతిభే గీటురాయి
► కొత్త వలస విధానంతో తెచ్చిన ‘రైజ్‌’ బిల్లుకు ట్రంప్‌ ఆమోదం
► భారతీయులకు వరంగా బిల్లులోని అంశాలు
► లాటరీ విధానానికి స్వస్తి.. పాయింట్ల ఆధారంగా కార్డులు
► ఆంగ్లంపై పట్టు, ఉన్నత విద్య, అధిక వేతనం,
► వయసు ప్రాతిపదికన పాయింట్లు..
► మనోళ్లు సులభంగా 30 పాయింట్లు సాధించే అవకాశం
► కీలక సంస్కరణ: ట్రంప్‌.. వలస వ్యతిరేక చట్టం: డెమోక్రాట్లు

వాషింగ్టన్‌
అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డు) కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయులకు శుభవార్త! ఇన్నాళ్లూ గ్రీన్‌కార్డుల జారీకి అనుసరించిన లాటరీ విధానానికి ట్రంప్‌ సర్కారు స్వస్తి పలకనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయసు ప్రాతిపదికగా ఇకపై కార్డులు జారీ చేయనున్నారు. ఇవన్నీ భారతీయులకు వరంగా మారనున్నాయి. గ్రీన్‌కార్డుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ‘రైజ్‌’(రిఫార్మింగ్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ ఫర్‌ స్ట్రాంగ్‌ ఎంప్లాయ్‌మెంట్‌) బిల్లును రూపొందించారు. ప్రతిభ ప్రాతిపదికన గ్రీన్‌కార్డులు జారీ చేయాలంటూ సెనెటర్లు టామ్‌ కాటన్, డేవిడ్‌ పెర్‌డ్యూ రూపొందించిన ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఆమోదం తెలిపారు.

వాస్తవానికి వలసల్ని తగ్గించడమే బిల్లు ఉద్దేశమైనా భారత్‌ వంటి దేశాల నుంచి వచ్చే ఉన్నత విద్యావంతులు, ఐటీ ఉద్యోగులకు ఈ బిల్లు మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. బిల్లులోని ప్రతిపాదించిన అంశాల ప్రకారం చూస్తే మనవాళ్లే ముందుంటారని, దీంతో సులువుగా గ్రీన్‌కార్డులు దక్కుతాయని విశ్లేషిస్తున్నారు. ప్రతిపాదిత బిల్లు ఉభయసభల్లో గట్టెక్కి చట్టం అమల్లోకి వస్తే లాటరీకి స్వస్తి పలికి ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డులు జారీ చేస్తారు. అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ, 26–30 ఏళ్ల మధ్య వయసు, ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం, మంచి వేతనం ఉంటే గ్రీన్‌కార్డులు పొందడం తేలిక కానుంది. ప్రస్తుతం అమెరికా ఏడాదికి 10 లక్షల గ్రీన్‌కార్డులు జారీ చేస్తుండగా.. పదేళ్లలో సగానికి తగ్గించేలా ఈ బిల్లును రూపొందించారు.

అమెరికన్ల వేతనాలు పెరుగుతాయి: ట్రంప్‌
‘రైజ్‌ చట్టం వల్ల అమెరికాలో పేదరికం తగ్గడమేగాక, జీతాలు పెరుగుతాయి. బిలియన్‌ డాలర్ల పన్నులు ఆదా అవుతాయి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. బిల్లుకు మద్దతుగా వైట్‌హౌస్‌లో ఆయన మాట్లాడుతూ.. గత 50 ఏళ్ల అమెరికా వలస విధాన ప్రక్రియలో ఇది కీలకమైన సంస్కరణగా నిలిచిపోతుందన్నారు. ‘‘గ్రీన్‌కార్డుల జారీలో తక్కువ నైపుణ్యమున్న వారికి అవకాశం కల్పిస్తున్న ప్రస్తుత విధానానికి రైజ్‌ చట్టం మంచి ప్రత్యామ్నాయం. అమెరికన్‌ ఉద్యోగులు చెదిరిపోకుండా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుంది. నైపుణ్యం లేని వలస ఉద్యోగులు తగ్గడం ద్వారా అమెరికన్ల వేతనాలు పెరుగుతాయి. ప్రస్తుత వలస విధానం అమెరికన్‌ ప్రజలు, ఉద్యోగులకు అనుకూలంగా లేదు. కొత్త చట్టంతో 21వ శతాబ్దంలో అమెరికా పోటీతత్వాన్ని, అమెరికాతో దేశ పౌరులకు ఉన్న దృఢమైన బంధాన్ని పునరుద్ధరిస్తుంది. ప్రతీ ఏడాది 10 లక్షల మందికి గ్రీన్‌కార్డుల్ని జారీచేస్తున్నాం. అమెరికాలోని మోంటానా రాష్ట్ర జనాభాతో అది సమానం. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పటిదాకా ఆంగ్లంపై పట్టు, ఉద్యోగ నైపుణ్యం, మంచి వేతనం ప్రాతిపదికగా గ్రీన్‌కార్డుల కేటాయింపు జరగడం లేదు. ఇకపై అలా ఉండదు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

నైపుణ్యం ఉన్నవారికి ప్రయోజనకరం: వైట్‌హౌస్‌
నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులకు ఈ చట్టంతో మేలు కలుగుతుందని ట్రంప్‌ సీనియర్‌ సలహాదారు జాసన్‌ మిల్లర్‌ పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విధానం ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియాల్లో అమలవుతోందని, పాయింట్ల ఆధారంగా కొత్త విధానం అమలు చేయడం చరిత్రాత్మకమని మిల్లర్‌ అభిప్రాయపడ్డారు. పాయింట్ల ఆధారంగా గ్రీన్‌కార్డుల జారీ విధానాన్ని ఈ ఏడాది ఆరంభంలో స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ ప్రసంగంలో ట్రంప్‌ ప్రస్తావించారని చెప్పారు. జీవిత భాగస్వాములు, మైనర్లకు గ్రీన్‌కార్డుల జారీ తగ్గించాలని కూడా ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. అమెరికన్‌ ఉద్యోగులను పరిరక్షించేలా ప్రతిభ ఆధారిత వలస చట్టాన్ని అమలు చేస్తామన్న ప్రధాన ఎన్నికల వాగ్దానాన్ని ఈ చట్టంతో ట్రంప్‌ నెరవేర్చారని మిల్లర్‌ చెప్పారు.వలసదారులే దేశానికి కొత్త శక్తి: డెమోక్రాట్లు
రైజ్‌ చట్టం వలస ప్రజలకు వ్యతిరేకమని డెమోక్రటిక్‌ సభ్యులు పేర్కొన్నారు. వలసదారులు ఎప్పటికప్పుడు దేశానికి కొత్త శక్తిని అందిస్తున్నారని.. అమెరికాకు వచ్చే ప్రతి కొత్త తరం ఈ దేశాన్ని మరింత ఉన్నతంగా మారుస్తుందని డెమోక్రటిక్‌ నేత నాన్సీ పెలోసీ అన్నారు. మొదట్నుంచీ ట్రంప్‌ వలస వ్యతిరేక అజెండాను అమలు చేస్తున్నారని.. వలస ప్రజల్లో భయాన్ని నింపడం వల్ల దేశం బలహీన పడుతుందని హెచ్చరించారు.

భారతీయ టెకీలకు లాభమే!
రైజ్‌ బిల్లు చట్టరూపం దాలిస్తే భారతీయులకు లాభమే. ప్రస్తుతం 3 నుంచి 3.5 లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు హెచ్‌–1బీ వీసాపై అమెరికాలో ఉన్నారు. 2016లో మొత్తం 1,26,692 మంది భారతీయులు హెచ్‌–1బీ పొందడమో, పొడిగించుకోవడమో చేశారని అమెరికా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది అమెరికా జారీ చేసిన హెచ్‌–1బీ వీసాల్లో భారతీయులకే ఏకంగా 72 శాతం దక్కాయి. వీరిలో అత్యధికులు అమెరికాలో స్థిరపడాలనే కోరుకుంటారు. గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేస్తే రైజ్‌ విధానంలో భారతీయులకు పాయింట్లు అధికంగా వచ్చే అవకాశాలుంటాయి.

► భారతీయుల్లో అత్యధికులు అమెరికా వర్సిటీల్లో మాస్టర్స్‌ (పీజీ) పూర్తిచేసిన వారే ఉంటారు. విద్యార్హతపరంగా వీరికి 8 పాయింట్లు లభిస్తాయి.

► గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే నాటికి మనోళ్ల వయసు 25 ఉంటుంది. 26 నుంచి 30 ఏళ్ల కేటగిరీలో ఉంటారు కాబట్టి.. 10 పాయింట్లు లభిస్తాయి.

► ఆదాయపరంగానూ, ఆంగ్ల భాషలో ప్రావీణ్యంలో కూడా మనోళ్లకు మంచి మార్కులే పడతాయి. కాబట్టి గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి 30 పాయింట్ల అర్హతను భారతీయుల్లో అత్యధికులు సులభంగా సాధిస్తారు.

► గ్రీన్‌కార్డుల్లో ప్రతి దేశానికి ఒక ఏడాదికి ఇంత శాతం మించకూడదనే నిబంధన కారణంగా ప్రస్తుతం గరిష్టంగా 2 శాతం లెక్కన 9,600 డిపెండెంట్‌ గ్రీన్‌కార్డులు, గరిష్టంగా 7 శాతం లెక్కన 9,800 ఉద్యోగస్తుల గ్రీన్‌కార్డులు ఏటా భారత్‌కు లభిస్తున్నాయి. ఈ కోటాపై పరిమితుల్లో మార్పులు, చేర్పులు చేస్తారా? అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ పరిమితి ఎత్తివేస్తే మాత్రం గ్రీన్‌కార్డుల్లో భారతీయులు భారీగా లబ్ధి పొందుతారు.

► హెచ్‌–1బీ వీసాల జోలికి ప్రస్తుతం వెళ్లలేదు. అయితే వీటి దుర్వినియోగం జరుగుతోందని ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ, ఎన్నికయ్యాక పలుమార్లు చెప్పారు. ఈ వీసాలకు కనిష్ట వేతనాన్ని 1,30,000 డాలర్లకు పెంచుతూ బిల్లు కూడా పెట్టారు.

► భవిష్యత్తులో హెచ్‌–1బీ వీసాలకు కూడా ప్రతిభ ఆధారిత విధానాన్ని తెస్తే.. ఉన్నత విద్యార్హతలు, ఆంగ్లంపై పట్టు, మంచి వేతనాలు ఉంటాయి కాబట్టి భారతీయ టెకీలకు నష్టమేమీ ఉండదు. ప్రస్తుతం అమెరికా ఏటా ఇచ్చే 65,000 హెచ్‌–1బీ వీసాల కోసం కంపెనీలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేస్తున్నాయి. తద్వారా లాటరీలో వాటికి వీసాలు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ విధానం దుర్వినియోగం అవుతోందని, బడా కంపెనీలు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసి ఇతరుల అవకాశాలను దెబ్బతీస్తున్నాయని ట్రంప్‌ వాదన. అందువల్ల హెచ్‌–1బీ వీసాల మంజూరు విధానంలోనూ మార్పులు రావొచ్చు.
చిరుతతో 15 నిమిషాలు పోరాడి తల్లిని కాపాడుకున్న ధీర వనిత
ఉచిత ఆరోగ్య బీమా వచ్చేస్తోంది... కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్
మెరుగైన చికిత్స కోసం నేడు అమెరికాకు వెళ్లనున్న గోవా సీఎం
అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్
ప్రధాని మోదీని ‘శ్రీ’ అని సంబోధించని ఫలితం.. ఏడు రోజుల వేతనం కోల్పోయిన బీఎస్ఎఫ్ జవాను!
రాంగ్ రూట్ లో వచ్చి, హైదరాబాద్ లో ఫ్లైఓవర్ పై నుంచి కిందపడ్డ ఐటీ ఉద్యోగుల బస్సు
హెచ్‌1 బి వీసా: మరింత కఠినం
వాటర్ బాటిల్స్.. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే జైలుకే!
ఇవాంకా.. ఇంకొన్ని ఆసక్తికర సంగతులు..
అమ్మ లేకపోతే నాన్న జీరోనే
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :275502                      Contact Us || admin@rajadhanivartalu.com